🙏ఓం శ్రీ గురుభ్యోనమః🙏 🌹🌹 శ్రీరస్తు, శుభమస్తు, అవిఘ్నమస్తు. ఓం సర్వ జగద్రక్షాయ గురు దత్తాత్రేయ శ్రీ పాద శ్రీ వల్లభ పరబ్రహ్మాణేినమః శ్రీపాద శ్రీవల్లభ చరితామృతములో కొన్ని ముఖ్యమైన అంశాలు మననం చేసుకుంటూ ఉన్నాము. తిరుమలదాసు నుండి శంకరభట్టు సెలవు గైకొని కురువపురము దిశగా ప్రయాణము మొదలుపెట్టేను. ఒక అశ్వద్ధవృక్షము కింద శ్రీపాదుల వారి నామమును జపించిచూ ఉన్న సుబ్బయ్య శ్రేష్టి తారసపడెను. ఈతని వృత్తాంతము తెలుసుకుంటూ ఉన్నప్పుడు మనకు అనేక స్వామి వారి లీలలు తెలుస్తూ వెడతాయి. సుబ్బయ్య శ్రేష్టి: నాయనా! తీర్థములలో కెల్లా శ్రేష్టమని పిలువబడే పాదగయా తీర్థరాజమును కలిగిన శ్రీ పీఠికాపురము మా స్వగ్రామం. నేను నా అజ్ఞానవశమున దేవబ్రాహ్మణనింద చేయువాడను. బాకీలు వసూలు చేయుట యందు కాఠిన్యం ప్రదర్శించే వాడను. ఒక పర్యాయము శ్రీపాదుల వారి తండ్రి గారు అయిన అప్పలరాజశర్మ గారి ఇంటికి అయినవిల్లి నుండి బంధుగణము విశేషముగా వచ్చిరి. వారందరికీ భోజన భాజనములు ఏర్పాటు చేయుటకు అప్పలరాజ శర్మ గారి వద్ద రొక్కము లేకుండెను. వెంకటప్పయ్య శ్రేష్టి గారి వద్దకు వెళ్లిన, శ్రేష్టి గారు వారి కుల పురోహితులు అగుట వలన ఉదారంగా వ్యవహరించి రొక్కమును స్వీకరింపక, వెచ్చములను ఉచితముగా ఇచ్చెదరు. అప్పుడది దానము అగును. కానీ, అప్పలరాజశర్మ గారు దానమును స్వీకరించరు. విధి లేని పరిస్థితులలో వారు ఒక వరహా ఖరీదు చేయు వెచ్చములను నా దుకాణము నుండి తీసుకొని వెళ్ళిరి. బంధు గణము వెళ్లిపోయిన తదుపరి నేను రాజశర్మను నా బాకీ తీర్చమని దండించితిని. చేతిలో చిల్లి గవ్వ లేదని, తనకు ధనము చిక్కినప్పుడు తప్పక చెల్లించెదను అని రాజ శర్మ బదులు ఇచ్చెను. నేను చక్ర వడ్డీ వసూలు చేయుటలో కడు నేర్పరిని. కాలము గతించు చుండెను. నేను వడ్డీ కి వడ్డీ లెక్క వేసి దొంగలెక్క వేసి పది వరహాలు ఇవ్వవలెను అని తేల్చితిని. అంత ధనమును నాకు ఈయవలెను అన్న రాజ శర్మ గృహమును అమ్మివేయవలెను. అప్పుడున్న ధరవరుల ప్రకారము వారి గృహమును నేను తీసుకొని ఒకటి, రెండు వరహాలు వారికి ఇచ్చిన సరిపోవును. ఈ విషయమును పదుగురి ఎదుట చెప్పుచుండేడివాడను. రాజశర్మను గృహవిహీనునిగా చేయుట నా సంకల్పము. మిగిలిన విషయములు రేపు తెలుసుకుందాము. సర్వం శ్రీ పాద శ్రీ వల్లభ చరణారవిందమస్తు🙏